![]() |
నవ దుర్గలు - జగన్మాతలు.
|
నవరాత్రి మహోత్సవాలు 2024
నవరాత్రి మహోత్సవం వచ్చిందంటే భారతదేశమంతా ఆధ్యాత్మిక శోభ విరజిల్లే కాలం. సాక్షాత్తూ ఆ దుర్గమ్మ తొమ్మిది అవతారాలను తొమ్మిది దినాలు భక్తిశ్రద్దలతో మరియు నియమనిష్టలతో కొలచి అమ్మవారి కృపకు పాతృలయ్యేందుకు సగటు హిందువు పరితపిస్తుంటాడు.
సంస్కృతం నుండి తీసుకోబడిన ఈ “నవరాత్రి” అనగా తొమ్మిది రాత్రులు జరుపుకొనే పూజ అని అర్ధమవుతున్నది. చంద్రమాన పంచాజ్ఞం ప్రకారం నవరాత్రులు ఒక సంవత్సరానికి ఐదు వస్తున్నప్పటికీ వాటిలో మార్చ్-ఏప్రిల్ లో వచ్చే వసంత నవరాత్రి మరియు సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో వచ్చే శరత్ నవరాత్రి లేదా శరన్నవరాత్రులు ప్రముఖమైనవి.
హిందూ పండగలలో ఎంతో ముఖ్యమైన ఈ నవరాత్రులు తరువాత వచ్చే 10రోజుని “దసరా పండగ” మరియు "విజయదశమి" గా పరిగణించుచున్నారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి నుండి నవరాత్రులు తరువాత వచ్చే పదవరోజు జరుపుకొనే పండగే “దసరా”. ఈ దసరా పండగ ముఖ్యముగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో ఆయా సంవత్సరాల పంచాంగాల గణన బట్టి ఉంటుంది.
శక్తి రూపిణి అయిన అమ్మవారి పూజలు జరుపుకొనే తొమ్మిది రోజులను నవరాత్రులు అని శరదృతువు ప్రారంభంలో వచ్చే పూజలు కనక శరన్నవరాత్రులుగా పరిగణిస్తారని పెద్దల మాట.
మహిషాసురమర్ధిని పేరెలావచ్చిందంటే...:
అయితే ఈ నవరాత్రి కథనం ప్రకారం, దుర్గమ్మ తల్లి, మహిసాసురుడనబడే అహంకారానికి ప్రతిరూపమైన రాక్షసునితో నవరాత్రులు జరిపిన యుద్ధం అని పురాణాలు చెబుతున్నవి. మహిసాసురిని వధించినందునే దుర్గమ్మ మహిసాసురమర్ధినిగా కొలువబడుతున్నారు. యుద్దంలో జగన్మాత విజయోత్సురాలైన 10వ రోజునే విజయదశమిగా పండగ జరుపుకొంటున్నాము.
ఆయుధ పూజ :
మరియొక కధనం ప్రకారం, రాముడు రావణునిపై సాధించిన విజయానికి ప్రతీక “విజయ దశమి” అని అలాగే వనవాసం ముగించుకొచ్చిన పాండవులు జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాలను తీసినరోజున “విజయ దశమి” కాబట్టి అదేరోజు ఆయుధపూజ చేయటం ఆచారంగా మారిందని చరిత్ర చెపుతున్నది.
ఈ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజున ఒక్కో అవతారంలో పూజించటం ఆనవాయితీ. పూజల్లో ప్రతీరోజూ ఓ ప్రత్యేకమైన రంగుని వాడతారు.
నవరాత్రి పూజ విశిష్టత :
నవరాత్రి పూజను నవదుర్గల రూపాల్లో మొదటిదైన శైలపుత్రితో ప్రారంభిస్తారు. తొమ్మిది రోజులు చేయలేనివారు ఐదురోజులు, ఐదురోజులు చేయలేనివారు మూడు రోజులు, మూడు రోజులు కూడా చేయలేనివారు కనీసం ఒక్కరోజయినా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని శాస్తవ్రచనం.
నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి శబ్దానికి పరమేశ్వరి అనీ అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం.
ఈ నవరాత్రులు ఉత్తరాదివారు ఒకలా దక్షిణాదివారు మరోలా స్వల్ప మార్పులతో ఆచరిస్తుంటారు.
నవరాత్రుల రోజువారీ విశిష్టతలు :
తొలిరోజు శైలపుత్రి :
దుర్గాశరన్నవరాత్రుల్లో ప్రారంభమయ్యే తొలి అవతారం శైలపుత్రి. శైల అనగా రాయి అని పుత్రి అనగా కుమార్తె అని అర్ధం. శైలపుత్రి పర్వత రాజైన హిమవంతుని ప్రథమ పుత్రిక పార్వతీదేవి. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి.ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
అయితే ఈరోజు అమ్మవారిని పూజించే వారికి రాయి కంటే దృఢమైన దైవబలాన్నికరుణిస్తారని ప్రతీతి.
ఈ తొలిరోజు ఎరుపు రంగు. ఎరుపు రంగు క్రియని మరియు శక్తికి ప్రతీక.
రెండవరోజు బ్రహ్మచారిణి :
ఈ అవతారం లో, దుర్గ బ్రహ్మచారిణిగా పరమేశ్వరుని భర్తగా పొందేందుకు తపస్సును చేస్తుంది. "బ్రహ్మ" అంటే తపస్సు అని అర్ధం మరియు "చరిణి" అనేది ఒక చక్కని పురుషుడు అనుచరుడు అని అర్థం. ఆమె యాగాగ్నిలో తననుతాను అర్పించుకుంటుంది. ఆ తరువాత, దుర్గా హిమవంతుని కుమార్తెగా జన్మించింది. ఆమెకు పార్వతి పేరు పెట్టారు. ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరుంది.ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా విజయాలు ప్రాప్తిస్తాయి.
ఈ రెండవ రోజు ముదురు నీలం రంగు శాంతి, సంతోషం, సౌభాతృత్వాలకు ప్రతీక.
మూడవరోజు చంద్రఘంట :
నవరాత్రి మూడవ రోజు అమ్మవారి మూడవ అవతారం “చంద్రఘంట”ని పూజిస్తారు. ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన చంద్రుడిని ఘంట ఆకారంలో ఆభరణం ధరించినట్లు ఈ దేవి ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ దేవి పేరును స్మరించడం మన మనస్సును నియంత్రణతో మరింత చురుకుదనంగా ఉంటుంది.ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.
ఈ దేవత అందము, కరుణలకు ప్రతికగా “పసుపు” రంగును వాడుతారు.
నాల్గవరోజు కూష్మాండ :
నవదుర్గల్లో నాలుగవ రూపం కూష్మాండ. కూష్మాండ అంటే గుమ్మడికాయ. ఒక గుమ్మడికాయ అనేక విత్తనాలు కలిగి ఉంటుంది మరియు ప్రతి విత్తనం ఎన్నో గుమ్మడికాయలను కాచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సృజనాత్మక శక్తి మరియు దాని శాశ్వతమైన తత్త్వం వలెనే సృష్టి ఒక గుమ్మడికాయ వంటిది. ఈ కుష్మాండం వలెనే.దేవిమాతలో మొత్తం సృష్టి కలిగి ఉంది. ఈ అమ్మవారి అవతారాన్ని పూజించే భక్తులకు సృజనాత్మక శక్తి చేకూరుతుందని నమ్మకం. ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
విశ్వాన్ని సృష్టించిన మాతగా పరిగణింపబడే ఈ దేవతకు ఇష్టమైన రంగు “ఆకుపచ్చ” రంగు.
ఐదవరోజు స్కందమాత :
నవదుర్గల్లో అయిదో అవతారం స్కందమాత. స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి తన బిడ్డడైన స్కందుని ఒడిలో కూర్చోబెట్టుకొని తన వాహనమైన సింహంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరింపబడినది. ఇది అమ్మవారి ధైర్యానికి, కరుణకి ప్రతీక.తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.
ఈ దేవతకు నచ్చిన రంగు “బూడిద రంగు ”.
ఆరవరోజు కాత్యాయని :
దుర్గామాత నవరూపాల్లో ఆరో రూపం కాత్యాయని. “కత్యాయన్” అనే రుషి కూతురుగా జన్మించినందున ఈ రూపానికి కాత్యాయని అనే పేరు వచ్చింది. కాత్యాయనీ రూపంలో అమ్మవారు చతుర్భుజి. రెండుభుజాల్లో ఒక దానిలో పొడవాటి కత్తి మరో దానిలో కమలం ఉండగా మూడవచేతితో భక్తులను ఆశేర్వదిన్చాతానికి నాల్గవ చేతితో భక్తులను రక్షించే ధ్యాసలో అమ్మవారి రూపం ఉంటుంది.ఈ రోజు రంగు “కమలాపండు” (Orange) రంగు.
ఏడవరోజు కాళరాత్రి :
దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. “కాళ” అనగా సమయమని లేదా మరణాన్ని సూచిస్తుంది. “రాత్రి” అనగా చీకటిని లేదా అజ్ఞానాన్ని సూచిస్తుంది. దుర్గమ్మ ఈ అవతారంలో చీకటి యొక్క మరణాన్ని మరియు అజ్ఞానం ముగింపుని పలుకుతుంది. అందుచే ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది.నల్లని వర్ణంలో ఉండే అమ్మవారు తెల్లని వస్త్రాలను ధరిస్తారు. అందుచే ఈ రోజు రంగు “తెలుపు”
ఎనిమిదవరోజు మహాగౌరి :
మహా అంటే చాలా అని అర్థం మరియు గౌర వర్ణం అంటే తెలుపు రంగు. తెలుపు స్వచ్ఛతను సూచిస్తుంది. స్వచ్ఛత అమాయకత్వం నుండి వస్తుంది. మహా గౌరీ ప్రజ్ఞ మరియు అమాయకత్వం కలయిక. “గౌ” అనగా జ్ఞానమని అర్ధం. భక్తులు మహాగౌరికి ప్రార్థిస్తే, ఆమె అందమైన జీవితాన్ని అమితమైన జ్ఞానాన్ని ఇస్తుందని ప్రతీతి.భక్తులు సంబంధబాంధవ్యాల పటిష్టత కొరకు అమ్మవారిని పూజిస్తారు. చల్లని తల్లి, జ్ఞాని మహాగౌరి. ఈ రోజు రంగు “గులాబీ”.
తొమ్మిదవరోజు సిద్ధిధాత్రి :
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాదిస్తుంది. సిద్ధి అనగా పరిపూర్ణత అని అర్ధం. మనం ఏదో ఒకటి కోరుకున్నప్పుడు అవసరం కంటే ముందే మీకు లభించటమే సిద్ధి అంటే.అమ్మవారి భక్తులు ఇలాంటి సిద్ధులను తమ భక్తి మార్గంలో ఎన్నింటినో పొందుతారు. ఎవరైతే వాటిని చెడుకు ఉపయోగిస్తారో వారు పొందిన సిద్ధులను కోల్పోతారు.
పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీపురాణం చెబుతున్నది.
శాంతికాముకురాలిగా కనిపించే ఈ తల్లిని ప్రతిబింబించే రంగు “లేత నీలివర్ణం” (Sky Blue)
2024 దసరా పండగ జరుపుకొను తేదీలు:
ఈ 2024వ సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నవరాత్ర ఉత్సవాలను అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభించి తొమ్మిదవ రోజును అక్టోబర్ 11 వ తారీఖు వరకు జరుపుకొని అక్టోబర్ 12వ తేదీన దసరా పండగను జరుపుకొంటారు.
దక్షిణ భారతదేశంలో నవరాత్రి వేడుకలు :
(ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఆచరించే విధానం)
దుర్గా నవరాత్రులు 2024. | |||
నవరాత్రులలో రోజువారీ అమ్మవారి అలంకరణలు, నైవేద్యము, నచ్చే రంగుల, పట్టిక | |||
తేది
|
అలంకారం
|
నైవేద్యం
|
నచ్చే రంగు
|
03/10/2024
|
శ్రీ స్వర్నకవచాలంకృత దేవి.
(శైలపుత్రి నవదుర్గ)
|
చలిమిడి, వడపప్పు, పాయసం.
| ఎరుపు రంగు.
|
04/10/2024
|
శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి.
(బ్రహ్మచారిని నవదుర్గ)
|
తీపి బూంది, పాయసం.
| నీలం రంగు.
|
05/10/2024
|
శ్రీ గాయత్రి మాత.
(చంద్రఘంట నవదుర్గ)
|
పులిహోర
| పసుపు రంగు.
|
06/10/2024
|
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
(కూష్మాండ నవదుర్గ)
|
పులిహోర,
పెసర బూరెలు.
| ఆకుపచ్చ రంగు.
|
07/10/2024
|
శ్రీ సరస్వతి దేవి.
(స్కందమాత నవదుర్గ)
|
అటుకులు, బెల్లం, శెనగపప్పు, కొబ్బరి.
| బూడిద రంగు.
|
08/10/2024
|
శ్రీ అన్నపూర్ణా దేవి.
(కాత్యాయనీ నవదుర్గ )
|
పొంగలి.
| కమలాపండు రంగు (Orange).
|
09/10/2024
|
శ్రీ మహలక్ష్మి దేవి.
(కాళరాత్రి నవదుర్గ )
|
క్షీరాన్నం.
| తెలుపు రంగు.
|
10/10/2024
|
శ్రీ దుర్గా దేవి.
(మహాగౌరి నవదుర్గ)
|
అల్లం వడలు, నిమ్మరసం,
| గులాబీ రంగు.
|
11/10/2024
|
శ్రీ మహిససురమర్ధిని అమ్మవారు
(సిద్ధిధాత్రి నవదుర్గ)
|
చక్రపొంగలి.
| లేత నీలి రంగు.
|
12/10/2024
|
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు.
|
పులిహోర, గారెలు.
|
ఆకుపచ్చ
|
దసరా పండగల వేడుకలు:
ఈ దసరా పండగ చెడుపై మంచి సాధించిన విజయంగా దేశంలోని ప్రజలు వివిధ ప్రాంతాలలో వారి ప్రాంతీయ ఆచారాల ప్రకారం జరుపుకోవటం పరిపాటి. ఈ పండగ వేడుకల్ని చూసి ఆనందించేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతూవుంటారు. ముఖ్యంగా యువత సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ కొట్టే కేరింతల్లో ఉట్టిపడే ఉత్సాహం ప్రాధాన్యాన్ని సంతరించుకొంటుంది.
# image courtesy: by sharmy in a reply to a question @ https://www.quora.com/What-is-the-significance-of-each-day-of-Navratri.
No comments:
Post a Comment