అష్టైశ్వర్యాలు కలిగించే మాసం "శ్రావణ మాసం" - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Friday, August 2, 2019

అష్టైశ్వర్యాలు కలిగించే మాసం "శ్రావణ మాసం"

SRAVANA LAXMI
శ్రీ మహలక్ష్మి
శ్రావణ మాసం విశిష్టత:


హిందూ సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత కలిగిన మాసం  "శ్రావణ మాసం". హిందూ పంచాంగం ప్రకారం వచ్చే ఐదవ మాసమే "శ్రావణం".  ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసమని  పేరు వచ్చింది. ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిందంటే   మహిళలకు ఊపిరి సలపని పూజాది కార్యక్రమాలతో ప్రతి గృహం, ప్రతి దేవాలయం ఎంతో సందడి సంతరించుకొంటుంది. ఈరోజుల్లో వేకువ ఝామునే లేచి శిరస్నానమాచారించి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి, అందమైన ముగ్గుల వేసి అలంకరిస్తారు. గృహాలన్నీ ధూపదీప నైవేద్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంటాయి. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, గౌరీ వ్రతం, నాగపంచమి, కృష్ణాష్టమి వంటి ఎన్నో ప్రవిత్ర దినాలు రానున్నవి. 

అందుకే ఊరూవాడ కోలాహలంగా కళకళలాడే వాతావరణంతో  ఉంటాయి.

ఈ శ్రావణ మాసం మహా విష్ణువు మరియు పరమ శివులిద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో దేవాలయను దర్శించుకుంటారు.

ముఖ్యముగా మహిళలు ఎంతో నియమనిష్టలతో శ్రావణ మంగళ వారాలు, శుక్ర వారాలు గౌరీదేవి లేదా మహాలక్ష్మిలకు పూజలు జరుపుకుంటారు.

ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులు ఆధ్యాత్మితకు ముఖ్యమైన రోజులు కావటంతో భక్తులు సోమవారం శివునికి, మంగళ వారం గౌరీదేవికి, బుధవారం మహావిష్ణువుకి, గురువారం లక్ష్మీదేవికి లేదా గురుతుల్యులకు , శుక్రవారం లక్ష్మీదేవి, తులసి మాతలకు, శనివారం శ్రీవెంకకటేశ్వరునకు పూజలు సమర్పించి ఆధ్యాత్మికంగా అలౌకిక ఆనందాన్ని పొందుతుంటారు.

శివారాధనకు అనువైన "శ్రావణ మాసం ":


సర్వదేవతలకు  ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో పరమశివునకు ఎవరైతే శ్రావణ సోమవారం పంచామృతాలతో అభిషేకిస్తారో వారికి సకల శుబాలను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా శ్రావణ సోమవారంనాడు పరమశివునకు ప్రీత్రికరమైన బిల్వపత్రాలను, తెల్ల ఉమ్మత్త పూలను కానుకగా సమర్పిస్తారు.

మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రావణ నక్షత్రం":

త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన మహావిష్ణువుకు మరియు మహాలక్ష్మిలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. మహా విష్ణువు జన్మనక్షత్రం "శ్రవణ నక్షత్రం" కావడం, అలాంటి పేరుతో ఏర్పడిన "శ్రావణ మాసం" మహావిష్ణువు, లక్ష్మీదేవి పూజలకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ  "శ్రావణ మాసం" చేసే పూజలకు ఎంతో శక్తి ఉంటుందని వేదాలు చెబుతున్నవి.

శ్రావణ మంగళ గౌరీ వ్రతం / గౌరీ వ్రతం : 


శ్రావణ మంగళ వారాలు నూతనముగా వివాహము చేసుకున్న మహిళలు తమ దాంపత్యజీవితంలో సుఖశాంతుల  కొరకు భార్యాభర్తల బంధం పటిష్టత కొరకు గౌరీవ్రతాన్ని నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన దంపతులు తమ వివాహమైన తొలి శ్రావణ మంగళవారాన ఈ వ్రతాన్ని మొదలు పెట్టి ఆలా ఐదు సంవత్సరాలు వచ్చే ప్రతి శ్రావణ మంగళ వారం ఈ వ్రతాన్ని నిష్టతో ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించిన దంపతుల జీవితాల్లో సర్వశుభాలు జరుగుతాయని అంతేకాకుండా నిత్యా సుమంగళిగా ఉంటారని  నమ్మకం.

అంతేకాకుండా అవివాహ యువతులు "శ్రావణ మంగళ వారం " వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త దొరుకుతాడని పండితుల మాట. 

నాగపంచమి:

ఇక నాగపంచమి నాడు భక్తులు శివుని అభారణమైన నాగేంద్రునికి పాలు, పూలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు.

శ్రావణ మాసం వచ్చే శుక్ల పక్ష పంచమిని "నాగ పంచమి "గా పాటిస్తారు. నాగపంచమి అనేది హిందూ భక్తుల అచంచల భక్తితో పూజించే పండగ. నాగదేవతను పూజించడమనేది హిందూ మతంలో అనాదిగా వస్తున్నా ఆచారం. హిందూ పంచాంగంలో నాగదేవతలను ఆరాధించేందుకు కొన్ని ప్రసిద్ధమైన రోజులు కేటాయింపబడ్డాయి. వాటిలో శ్రావణ మాసంలో వచ్చే పంచమి తిధి నాగదేవతలకు ఆరాధించేందుకు ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. అందుచే నాగపంచమి పండగ హిందువుల పండగల్లో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు.

హిందువులు ఎంత మంది నాగదేవతలను పూజించినప్పటికీ నాగపంచమి నాడు విశేషంగా ఆరాధించే 12మంది నాగదేవతల వివరాలు :

1) అనంత 2) వాసుకి 3) శేషుడు 4) పద్మ 5) కంబళ 6) కర్కోటక 7) అస్వతారా 8) ధృతరాష్ట్రుడు 9) శంఖపాల 10) కలియ 11) తక్షక 12) పింగళ.

వరలక్ష్మి వ్రతం:

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్నచేసుకొనే పండగే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరిన్చాలో ఆ పరమశివుడు స్కందపురాణంలో పార్వతిదేవితో చెప్పి ఉన్నారు. స్త్రీలు సకల ఐశ్వర్యాలను పొందే ఏదేని వ్రతం గురించి వివరించమని పార్వతీదేవి పరమశివుని కోరన సందర్భంలో పరమశివుడు పార్వతీదేవికి తెలిపిన వ్రతమే "వరలక్ష్మివ్రతం". శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుతొ వచ్చే మాసము "శ్రావణ మాసం" కావటము, అందునా శ్రావణ శుక్ల పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం తన దేవేరి మహాలక్ష్మిని వరలక్ష్మిగా కొలిచే వరలక్ష్మి వ్రతం శ్రీహరికి ఎంతో ప్రీతికరమైనది. అందుచే ఈరోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అష్టలక్ష్ములను పూజించిన ఫలితం దక్కుతుంది.

శ్రీకృష్ణాష్టమి :

శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి నాడు దేవకీదేవులకు జన్మించాడు. అవతారపురుషుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని భక్తులు శ్రీకృష్ణాష్టమిగా , జన్మాష్టమిగా, గోకులాష్టమిగా వారి వారి ఆచారాలప్రకారం జరుపుకుంటున్నారు. ముఖ్యముగా శ్రీకృష్ణాష్టమినాడు భక్తులు శ్రీకృషుడిని భక్తిశ్రద్దలతో పూజించి పాలు, పెరుగు, వెన్నలను నైవేద్యముగా సమర్పిస్తారు.

శ్రీకృష్ణాష్టమిని పలు రాష్ట్రాల్లో ఇస్కాన్ సంస్థ ఎంతో విశిష్టంగా జరుపుకొంటుంది. వివిధ విష్ణు ఆలయాల్లో కూడా అంగరంగవైభవంగా శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు. గ్రామాల్లో శ్రీకృష్ణాష్టమి ఎంతో సందడిగా జరుపుకొంటారు.

శ్రావణ పౌర్ణమి : 

ఈ శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి నాడు మహావిష్ణువు "హయగ్రీవుని"గా అవతరించారు. అందుచే ఈ పవిత్ర దినాన విద్యాభ్యాసానికి, ఉపనయనాలు సుముహూర్తముగా భావిస్తారు. ఈ పవిత్రదినాన నూతన యజ్ఞోపవీతధారణ కూడా చేస్తారు. ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా పూజలు చేసుకుంటారు.

సోదరసోదరీమణులు తమ ప్రేమానుబంధాన్ని చాటే "రాఖీ పౌర్ణమి" కూడా ఈ పవిత్ర దినమే కావడం విశేషం. ఇన్ని ప్రాముఖ్యతలున్న పవిత్ర దినం "శ్రావణ పౌర్ణమి" విశిష్టతను తెలియచేయుచున్నది.

శ్రావణ శనివారం : 


మహావిష్ణువుకు ప్రీతికరమైనందున శ్రావణ శనివారాలు ఎవరైతే ఏకభుక్తముండి శ్రీవెంకటేశ్వరుడిని పూజిస్తారో వారు సకలశుభాలను పొందగలరు. ఈ మాసంలో వచ్చే అన్ని శ్రావణ శనివారాలు నియమనిష్టలతో "శనివారం వ్రతాన్ని" ఆచరిస్తే ఆ ఏడుకొండలవాని కృపకు పాత్రులుకాగలరని పెద్దలు చెబుతున్నారు. ఈ "శనివార వ్రతం" పుస్తకాలు స్థానిక న్యూస్ ఏజంట్లు, ఆధ్యాత్మిక పుస్తక విక్రయశాల వద్ద లభిస్తాయి.

శ్రావణ మాసం మహిళల సందడి  :


శ్రావణ మాసం వచ్చే అన్ని రోజులు ఆధ్యాత్మికతకు బహు ముఖ్యమైన రోజులు. ముఖ్యముగా మహిళలు ఎంతో నియమనిష్టలతో శ్రావణ మంగళ వారలు, శ్రావణ శుక్రవారాలు గౌరీదేవి మరియు మహాలక్ష్మిలకు విశేషంగా పూజలు చేస్తుంటారు. విశేషించి భక్తులు ఈ శ్రావణ మాసంలో సోమవారం శివునకు, మంగళవారం గౌరీదేవికి, గురువారం లక్ష్మీదేవికి, శుక్రవారం లక్ష్మీదేవి లేదా తులసి మాతకు, శనివారం శ్రీవేంకటేశ్వరునికి తమ శక్తి కొలది పూజిస్తారు.

No comments:

Post a Comment