మకర సంక్రాతి సంబరాల విశిష్టత.
![]() |
సంక్రాంతి డూడూ బసవన్న! |
:: 12 సంక్రాంతులు వివరణ ::
సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశి లో ప్రవేశించే క్రమాన్నే “సంక్రమణం” లేదా “సంక్రాంతి” అంటారు. ఇలా సూర్యుడు ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి 12 సార్లు ప్రవేశించడం 12రాశులకు వర్తిస్తుంది కాబట్టి ఏడాదిలో 12 సంక్రాంతులు వస్తుంటాయి.
:: మకర సంక్రాంతి గురించి ::
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించే క్రమంలో మకర రాశిలో ప్రవేశించే సందర్భమే "మకర సంక్రాంతి". మకరసంక్రాంతి ప్రారంభం అవగానే వాతావరణంలో కొంచెం కొంచెంగా సంభవించే మార్పులు అందరం అనుభూతి చెందుతాము.
:: మకరసంక్రాంతి మరియు ఉత్తరాయణం ::
ఈ "మకర సంక్రాంతి" నాడే ఉత్తరాయణం ప్రారంభమవుతున్నందున "పూజలు, అర్చనలు, ఆధ్యాత్మితకు" అనువైన కాలముగా పెద్దలు నిర్ణయించారు. ఉత్తరాయణం దేవతలు మేల్కొనే కాలము. కాబట్టే పుణ్య కాలం! దక్షిణాయణంలో అంపశయ్య పై ఉన్న "భీష్మ పితామహుడు" ప్రాణాలు నిలుపుకొని ఉత్తరాయణం కొరకు వేచి ఉండి ప్రవేశించిన పిదప తనువుచాలించడం ఇందుకు నిదర్శనం! అలంటి ఈ ఉత్తరాయణం మకర సంక్రాంతి నుండే మొదలవుతుంది.
:: మకర సంక్రాతి 2023 తేదీ ::
హిందువుల పండగల్లో అధికభాగం చాంద్రమాన పంచాంగం ప్రకారం తిధుల ప్రకారం తేదీ నిర్ణయింపబడుతుంది. కానీ మకరసంక్రాంతిని సూర్యుని గమనం ప్రకారం నిర్ణయిస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన భోగీ, జనవరి 15న మకర సంక్రాంతి మరియు జనవరి 16న కనుమ జరుపుకుంటారు.
:: మకరసంక్రాంతి సంబరాలు ::
"సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. "మకర సంక్రాంతి" నాటికి పంటలు నూర్పిడి పూర్తయ్యి ఇంటికి ధాన్యరాశులుగా చేరటంతో రైతుకుటుంబాలు, ధాన్యరాశులు కొనుగోలుచేసి కొత్త లక్ష్యాలను చేరుకొనే లక్ష్యాలతో వ్యాపారస్తులు, కొత్త బట్టలు కొనుక్కుని యువతీయువకులు, వారి సంతోషం చూసి దుస్తులు కొనిచ్చిన తల్లిదండ్రులు, కొత్త అల్లుళ్ళ రాక సందడిలో అత్తామామలు, ముంగిట గొబ్బెమ్మ ముగ్గులతో పెళ్లి కాని పడుచులు ఒకరేమిటి అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతుంటాయి.
:: మకర సంక్రాంతి ఎలా జరుపుకుంటారంటే ::
ఈ "మకర సంక్రాంతి" నే తమిళనాడులో "పొంగల్"గా పిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో "సంక్రాంతి" లేదా "పెద్దల పంగుగ"గా పేరొందింది. సంక్రాంతి దినాన పెద్దలకు పొత్తర్లు సమర్పించి పూజిస్తారు.
ఈ సంక్రాతి పండగ కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగాను (మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు) జరుపుకుంటారు. అయితే మూడు రోజుల ఈ పండగలో మొదటి రోజు భోగీ, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమగా (నాల్గవ రోజుగా "ముక్కనుమ") జరుపుకుంటారు.
ఈ సంక్రాతి పండగ కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులుగాను (మరికొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు) జరుపుకుంటారు. అయితే మూడు రోజుల ఈ పండగలో మొదటి రోజు భోగీ, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమగా (నాల్గవ రోజుగా "ముక్కనుమ") జరుపుకుంటారు.
:: భోగీ ::
ఈ రోజు ప్రజలు వేకువఝామునే నిద్దుర చాలించి తమ తమ ఇళ్ళల్లోని పాత కలప వస్తువులని మరియు తోటి వారి ఇళ్ళల్లోని నిరుపయోగంగా ఉన్న కలపని సంగ్రహించి వీధి కూడలిలో భోగి మంటను జ్వలింప చేసి పిల్లలతో పిడకల దండలు వేయించి శీతాకాలానికి స్వస్తి పలుకుతారు.
అంతేకాకుండా మహిళలు ఇంటి వాకిళ్ళను శుభ్రం చేసి రధం ముగ్గులను వారి పిండితో వేసి, చిన్న చిన్న పేడ ముద్దలను గొబ్బెమ్మలుగా చేసి ముగ్గులపై ఉంచి, పూలతో అలంకరించి "లక్ష్మీ దేవి" ని స్వాగతిస్తారు. సాయంకాలం పూట పసి పిల్లల శిరస్సులపై "బోగిపళ్ళు" కుమ్మరించి వారికి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్ధిస్తారు.
:: సంక్రాంతి ::
భోగి పండగ మరుసటి దినమే ఈ "సంక్రాంతి" పండగ! ఈరోజు ముఖ్యముగా అందరూ నూతన వస్త్రాలని ధరిస్తారు. అలానే కొత్త కుండలో "తాజా పళ్ళు, కొత్త బియ్యం, కొత్త బెల్లం, తాజా కూరగాయల"తో పాయసం లేదా పొంగల్ తయారు చేసి సూర్య భగవానునికి నైవేద్యం సమర్పిస్తారు. పిదప పితృ దేవతలకి పొత్తర్లు సమర్పించి, నూతన వస్త్రాన్ని చూపించి ప్రార్ధనలు చేస్తారు. అలాగే ఈరోజు గుమ్మడిపండు, పెసలతో వంటకాలు చేస్తారు. పేదలకు, యాచకులకు శక్తి కొలది దానధర్మాలు చేస్తారు,
:: కనుమ ::
మకర సంక్రాతి పండగలలో మూడోదైన రోజు "కనుమ"గా పండగ చేసుకొంటారు. ఈ కనుమ పండగ ముఖ్యముగా పశువుల కోసం జరుపుకుంటారు. మనుషులు పంటలు పండించుకోవటానికి, పండిన పంట ఇంటికి తెచ్చుకోవటానికి పశువుల సహకారం మరచిపోలేనిది.
ధనధాన్య రాశులతో మనిషి ఆనందంగా ఉన్నాడంటే పశువులపాత్ర మరువలేనిది. అందుకు కృతజ్ఞతగా జరుపుకునే పండగ "కనుమ". కాబట్టి ఈ రోజు శాలల్లోని పశువులను శుబ్రముగా స్నానం చేయిస్తారు. కొందరు కొమ్ములకు రంగులు కూడా వేస్తారు. పువ్వుల దండలతో అలంకరించి పశువులకు పొంగల్ లేదా పాయసం తినిపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు ఎద్దుల పోటీలను నిర్వహించి సంతోషిస్తారు.
:: మకర సంక్రాంతి క్రీడలు ::
ఇంటి పైకప్పున పిల్లల గాలిపటాలతో కేరింతలు కొడతారు. వివిధ రాష్ట్రాల్లో పతంగులు లేదా గాలిపటాలు పందేలు జరగటం పరిపాటి.
కొన్ని గ్రామాల్లో ఊరికి చివరి తోటల్లో కోడి పందేలు జరుపుకుంటారు. చిన్నాపెద్దా (స్థాయిల్లో) తారతమ్యం లేకుండా కోడి పందేల్లో పాల్గొనడం విశేషం.
హరిదాసు పాటలు, గంగిరెద్దు ఆటలతో ఊరు ఊరంతా హడావిడిగా చేసుకొనే పండగే "మకర సంక్రాంతి"!
:: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ::
ఈ రోజు ముఖ్యంగా యువతీ యువకులే కాకుండా అందరూ ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు వివిధరూపాల్లో తెలియపరచుకోవటం ఆచారంగా పాతుకుపోయింది. నేటి ఆధునికయుగంలో ఫేసుబుక్, వాట్సాప్, ట్విట్టర్ వాటి సామజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న విషయం మీకు తెలిసినదే!
:: మకర సంక్రాంతి దానాలు ::
- మకర సంక్రాంతి పుణ్య దినాన విశేషంగా చేస్తే జన్మజన్మల దరిద్రం పోతుందట.
- ఈ మకర సంక్రాంతి పుణ్య దినాన వివాహిత స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులు మరియు పండ్లను దానం చేయటం ద్వారా మాంగల్యం బలం దృఢంగా ఉంటుందట.
- మకర సంక్రాంతి నాడు గుమ్మడి పండును దానం ఇస్తే మహా విష్ణువుకు ప్రీతికరమని పండితుల మాట.
:: మకర సంక్రాంతి ప్రత్యేకతలు క్లుప్తంగా (Recap) ::
- మకర సంక్రాంతి నాడు విశేషించి శ్రీ సూర్యభగవానుని పూజలు చేస్తారు. నైవేద్యంగా బియ్యము, బెల్లం తో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించి శక్తి కొలది పూజలు చేస్తారు.
- మకర సంక్రాంతి నాడు పెద్దలకు పొత్తర్లు సమర్పించటం వారి ఆశీస్సుల కొరకు ప్రార్ధనలు చేస్తారు.
- ఈ పండగల్లో “హరిదాసు - గంగిరెద్దు” ప్రాధాన్యం చెప్పుకోతగ్గవి. తెల్లవారే సరికి హరిదాసు కీర్తనలు గంగిరెద్దు ఆటలు మకర సంక్రాంతికి వన్నె తెస్తాయి.
- స్త్రీలు పెట్టె గొబ్బెమ్మ రధం ముగ్గులు చెప్పుకోతగ్గవి. ఇవి పండగ కళని మరింత పెంచుతాయి.
- పిల్లల గాలిపటం / పతంగులు ఎగురవేస్తూ కొట్టే కేరింతలు ఈ పండగలో భాగమే.
- ఊరిశివారు తోటల్లో పేకాట రాయుళ్లు చేసే హడావుడి కోట్ల వరదలు పారిస్తాయి.
- ఈ పండగల్లో కోడిపందేలు అనాదిగా వస్తూ ఆచారాల్లో భాగంగా కనిపిస్తాయి.
No comments:
Post a Comment