108 శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రాలల్లో మొదటిది భూలోక వైకుంఠం "శ్రీరంగం"! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Friday, December 29, 2017

108 శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రాలల్లో మొదటిది భూలోక వైకుంఠం "శ్రీరంగం"!

Bhooloka vaikuntam "Srirangam"!
శ్రీరంగనాధ స్వామి! 
భూలోకవైకుంఠం శ్రీరంగం!

శ్రీ మహావిష్ణువు 108 దివ్యక్షేత్రాలలో ప్రధానమైనది మొదటిది "శ్రీరంగం"! అలానే శ్రీమహావిష్ణువు స్వయంవ్యక్తమైన అష్ట దివ్యక్షేత్రాలలో శ్రీరంగం అతి ప్రధానమైనది మరియు మొదటి దివ్యక్షేత్రం! ఈ శ్రీరంగం దివ్యక్షేత్రానికి "తిరువరంగాతిరుపతి", "భూలోకవైకుంఠం", "భోగమండపం"గా కూడా పిలువబడుతోంది. వైష్ణవ పరిభాషలోని "కోయెల్" లేదా "కోవెల" అనే పదం ఈ "శ్రీరంగం" క్షేత్రానికి మాత్రమే ఉపయోగించబడుతోంది.

కర్ణాటక రాష్ట్రం నుండి తమిళనాడు వరకు ప్రవహిస్తున్న కావేరీ నదీపరీవాహక ప్రాంతంలో ఏర్పడి ఉన్న మూడు ద్వీపాల్లో  శ్రీరంగనాధస్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. మూడు ద్వీపాల్లో మొదటిదైన "శ్రిరంగాపాటినం" మైసూరు ప్రాంతంలో ఉన్నది . దీనిని "ఆదిరంగం" (Origin of Rangam) అని, ఇక రెండవ ద్వీపమైన "శివంససాముతిరం" సుమారు "శ్రిరంగాపాటినం" నకు 70కి.మీ.దూరంలో ఉన్నది. దీనిని "మధ్యరంగం" (Middle of Rangam) అని పిలుస్తున్నారు. ఇక మూడవ ద్వీపమైన శ్రీరంగంను "అంత రంగం" (Last Part of Rangam - Meaning of Heaven)గా కూడా పిలుస్తారు. ఈ "శ్రీరంగం" తమిళనాడు రాష్ట్రంలో "తిరుచిరాపల్లి" రైల్వేజంక్షన్ కు సుమారు 9కి.మీ.దూరంలో ఉన్నది. "తిరుచిరాపల్లి" నగరం తమిళనాడు రాష్టంలో జనాభా పరంగా నాల్గవ అతి పెద్ద నగరంగా పేర్గాన్చింది.

శ్రీరంగం ప్రత్యేకతలు:

కావేరి నది రెండు బాహువుల మధ్య ఏర్పడిన ఓ ద్వీపం "శ్రీరంగం". ఈ దేవాలయం సుమారు 156 ఎకరాల విస్తీర్ణంలో ఏడు ప్రాకారాలు, భారీ బురుజు గోడల మధ్య ప్రాచీన తమిళ శిల్పసుందర కళాకృతులతో అలరారుతోంది. అన్ని ప్రాకారల్లోని 21 స్థంభాలు సందర్సుకులను అమితంగా ఆకర్షిస్తాయి. 

ఓ సామ్రాజ్యానికి చెందిన గత వైభవానికి చెందిన ఘన చిహ్నం, శ్రీరంగం శ్రిరంగానధస్వామి ఆలయం! వేలాది సంవత్సరాలనాటి నాగరికతా వైభవం!! హిందూమత వ్యాప్తి కోసం, పటిష్టత కోసం ఏర్పడిన ఓ గొప్ప వైష్ణవ దేవాలయం!!!

ఈ ఆలయానికి భారతదేశంలోని ఏ ఇతర దేవాలయానికి లేని విధముగా ఏడు ఏక కేంద్రక దీర్ఘచతురస్రాకర ప్రాకారాలు ఉన్నవి. ఇవి ఏడు యోగ కేంద్రకాలని మానవ శరీరాన్ని రూపొందించే ఏడు మూలకాలని సూచిస్తోందని వైష్ణవ మతస్తుల నమ్మకం.

ఏడవ ప్రాకారం : ఈ ప్రాకారంలోని గోపురాలను "రాజగోపురం" అంటారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణం పూర్తయితే ఈ గోపురం ఎత్తు 50 మీటర్లు ఉండవచ్చని అంచనా!

ఆరవ ప్రాకారం : ఈ ప్రాకారంలో మొత్తం గోపురాలు నాలుగు కలవు. 1300 శతబ్దంలో నిర్మించిన ఈ కట్టడాలు ఘనమైనవి, ఈ ప్రహరీలో ఊరేగింపు వాహనాలను ఉంచుతారు.

ఐదవ ప్రాకారం :  ఈ ప్రకారం ప్రాచీనమైనది. చోళుల కాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు.

నాల్గవ ప్రాకారం : అద్దాల్లో ముస్తాబులుకు మెరుగులు దిద్దుకుంటున్న శిల్పాలు ఈ ప్రాకారంలో ప్రత్యేకమైనవి. అంతేకాకుండా అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్సనశాల కూడా ఈ ప్రాకరంలో ఉన్నది.

మూడవ ప్రాకారం : ఈ ప్రాకారంలో "కార్తీక గోపురం" ఉంది. 14 వరుసలతో ఉన్న "గరుడ మండపం" నకు దారితీస్తున్నది. తూర్పు భాగంలో పవిత్రమైన "చంద్రపుష్కరిని" ఉన్నది. వీటితో పాటూ ప్రత్యేక పూజా మందిరాలు, మండపంలు ఉన్నవి. 

రెండవ ప్రాకారం : సందర్శకులు వెలుతురు ఉన్నపుడే ఈ ప్రాంగణానికి చేరుకోవాలి. ఇరుకుగా ఉండటం, కూలిపోయే మండపాల జాబితాలో ఉండటం ప్రధాన కారణం. ఈశాన్య భాగంలో దేవుని వంటశాల ఉన్నది. ఇక్కడినుండే భక్తులకు పాలను, ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంటారు. 

మొదటి ప్రాంగణం : ఈ ప్రాకారం కూడా రెండవ ప్రాకరంలానే ఉంటుంది. దీని దక్షిణ ద్వారానికి చెరో వైపున శంఖనిది, పద్మనిధి అనే బొమ్మలు మరియు విష్ణు చిహ్నలైన శంఖం, పద్మం ఉంటాయి. ఇవన్ని నైరుతి పక్కన నిల్వ చేసే గదులకు అమర్చబడి ఉంటాయి. వాయువ్య మూలలో యాగశాల, తొండమాన్ మండపం ఉన్నవి. ఇక తూర్పున అర్జున మండపం, కిళి మండపం ఉన్నవి.

శ్రీరంగం ఆలయ సన్నిధిలో ఉన్న ఇతర ఆలయాలు :

శ్రిరంగానాధుని ఆలయ ప్రాంగణంలో ఇతర సన్నిధులు, ఉపసన్నిధులు 53 ఉన్నవి. వీటిలో కొన్ని "తాయారు సన్నిధి", "చక్రధ్వజర్ సన్నిధి", "గరుడాల్వార్ సన్నిధి", "ధన్వంతరి సన్నిధి", "హయగ్రీవార్ సన్నిధి".

ఆలయంలో ప్రముఖ పండగలు :

  • జ్యేష్టాభిషేకం (ఆలయ శుబ్రత మరియు శ్రిరంగానాధునికి కావేరి నదీ జలాలతో అభిషేకం)
  • పవిత్రోత్సవం (నిత్య పూజాదిక దోషాలు తొలగుట కోసం స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ)
  • శ్రిజయంతి (ప్రాంగణంలోని శ్రీకృష్ణ దేవాలయాల్లో ఘనంగా శ్రీకృష్ణ జయంతి వేడుకల నిర్వహణ)
  • కైశిక ఏకాదశి.
  • విరుప్పాన్ పండగ (వృత్తి పరమైన దోషాలు నివృత్తి కొరకు నిర్వహించే పండగ)
పై పండగలు తమిళ మాసదికాల ప్రకారం ఘనంగా ఉత్సవాలుగా జరుపుకొంటారు.


శ్రీరంగనాధస్వామి  దేవాలయం నిత్య పూజల మరియు సేవల సమయాల పట్టిక
ఉదయం 6గం|| నుండి 
ఉదయం 6.30గం|| వరకు
విశ్వరూప సేవ
టికెట్ ధర ప్రతి ఒక్కరికి Rs.200/-
ఉదయం 6.30గం|| నుండి 
ఉదయం 7.30గం|| వరకు
సేవ
సాధారణ దర్సనం ఉచితం. 
శీఘ్ర దర్శనం Rs.50/-
ఉదయం 7.30గం|| నుండి 
ఉదయం 8గం||45 ని|| వరకు
పూజా సమయం
దర్శనం ఉండదు.
ఉదయం 8గం||45 ని|| నుండి 
మధ్యాహ్నం1గం వరకు
ఉదయం సేవ.
సాధారణ దర్సనం ఉచితం. 
శీఘ్ర దర్శనం Rs.50/-
మధ్యాహ్నం1గం|| వరకు నుండి 
సాయంకాలం 2గం||30 ని||
పూజా సమయం
దర్శనం ఉండదు.
సాయంకాలం 2గం||30ని|| నుండి 
సాయంకాలం 4గం||15ని|| వరకు
మధ్యాహ్నపు సేవ
సాధారణ దర్సనం ఉచితం. 
శీఘ్ర దర్శనం Rs.50/-
సాయంకాలం 4గం||15ని||  నుండి 
సాయంకాలం 6గం||వరకు
పూజ సమయం
దర్శనం ఉండదు


అన్నప్రసాదం : 

sri rangam annakoodali lo annaprasadam sevistunna bhaktulu!
శ్రీరంగం అన్నకూడలి  
"శ్రీరంగం" శ్రిరంగానాధస్వామి వారిని దర్శించే భక్తులకు అన్నప్రసాదం అందించే నిమిత్తం ఆలయ ప్రాంగణంలో "అన్నకూడం" భవనం నిర్మించారు. ఈ భవనంలో ఒక పంక్తిలో 250మంది భక్తులు అన్నప్రసాదం అందించే విధంగా మరియు 250మంది భక్తులు వేచి ఉండేందుకు తగిన పరిమాణంలో విశాలమైన భవంతులను నిర్మించారు. భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన ఈ 10000 చదరపు అడుగుల భవనంలో  వేచి చూసే గది కోసం 3000 చదరపు అడుగులు కేటాయించారు. భక్తులకు అన్నదానం ఉదయం 8గంటల నుండి రాత్రి 10గంటల వరకు పొడిగించబడినది.

వసతి సౌకర్యం : 

యాత్రినివాస్ లో కాటేజీలు
భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన "యాత్రి నివాస్" భవనం శ్రీరంగం దేవాలయం వెనుక భాగంలో కొల్లిడం నది ఒడ్డున నిర్మించారు. సుమారు 1000మంది భక్తులకు వసతి సౌకర్యం కలిగేలా ఈ రిసార్ట్ తరహాలో నిర్మించారు. భక్తుల సౌకర్యార్ధం 612 సింగిల్ రూములు, 98 డబుల్ రూములు, 24 ఫ్యామిలీ కాటేజీలు ఉన్నవి. అంతే కాకుండా ఒక రెస్టారెంట్, ఒక తాన్సుర్ హౌస్, డ్రైవర్ల కోసం రెస్ట్ రూములు, లాండ్రి, విశాలమైన పార్కింగ్ ప్రదేశం కల్గిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా కలవు.

రోడ్డు ప్రయాణం : 

దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి "తిరుచిరాపల్లి" నగరానికి రోడ్ కనెక్టివిటీ ఉంది బస్సు లేదా కార్ ద్వారా ప్రయాణించ వచ్చును. మన హైదరాబాద్ నగరం నుండి సుమారు 917కి.మీ. (15గంటలు), విజయవాడ నగరం నుండి 773కి.మీ.(12.30గంటలు), బెంగలూరు నగరం నుండి 342కి.మీ(6గంటలు), ముంబై నగరం నుండి 1333కి.మీ.(20గంటలు) ప్రయాణించాల్సి ఉంటుంది.

రైల్ సౌకర్యం : 

పైన పేర్కొన్న అన్ని ప్రధాన నగరాల నుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకొనవచ్చును. అక్కడి నుండి లోకల్ ట్రైన్ల ద్వారా "తిరుచిరాపల్లి" ("ట్రిచి") రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఇక్కడి నుండి "శ్రీరంగం" దేవాలయం 9కి.మీ. దూరములో ఉన్నది.

విమాన సౌకర్యం : 

వరల్డ్ వార్ -2 సమయంలో బ్రిటిష్ వారి అధ్వర్యంలో ఇక్కడి విమానాశ్రయం ప్రారంభింపబడింది. 1936లో తొలి విమానం లాండ్ అయింది. అయితే ఈ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందబడింది. ఇప్పటికీ ఆధునీకరింపబడుతున్నది. దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్ట్ లు అనుసంధానింపబడ్డవి. విమానాశ్రయం నుండి శ్రీరంగం దేవాలయం సుమారు 15కి.మీ. దూరములో ఉన్నది. విమానాశ్రయం నుండి "రెంట్ ఎ కార్" సౌలభ్యం ఉన్నది.
Article is written in inspiration from https://srirangam.org,  image sources: Sri Ranganadha Swamy: devineavatars.com, Annakoodali & Yatrinivas: https://srirangam.org

1 comment:

  1. Very valuable information about Sri rangam temple and God ranganatha swamy vaaru..thank you

    ReplyDelete