అరసవల్లి లో “శ్రీ సూర్యనారాయణ స్వామి” దివ్యక్షేత్రం! - దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

కొత్తవి

దివ్య క్షేత్రం :: మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

మీ తీర్ధయాత్రలకు రధచక్రం!!

Friday, January 6, 2023

అరసవల్లి లో “శ్రీ సూర్యనారాయణ స్వామి” దివ్యక్షేత్రం!

Sun God "Sri Suryanarayana Swamy"
సప్తసప్తి అనే సప్తాశ్వాలపై శ్రీ సూర్యనారాయణ స్వామి 


కలియుగ ప్రత్యక్ష దైవం "శ్రీ సుర్యనారాయణ స్వామి"

శ్రీకాకుళం నగరానికి అత్యంత సమీపంలో ఉన్న "అరసవల్లి"లో కొలువుతీరి ఉన్నారు. అరసవల్లి సూర్యనారాణ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై ఆరోగ్య భాగ్య ప్రధాతగా భక్తుల నీరాజనాలను అందుకొంటున్నారు. ప్రాచీన కాలంలో "హర్షవల్లి"గా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రం వాడుకలో "అరసవల్లి"గా మారి భక్తుల పాలిట భోగభాగ్య ప్రదాయని అయ్యింది.

చారిత్రిక పురాణాల ఆధారాల ప్రకారం బలరాముడు స్థాపించిన ఐదు శివలింగాలలో ఒకటైన శ్రీకాకుళంలోని "ఉమారుద్రకోటేశ్వరాలయం" దర్శించుకొనేందుకు దేవతలు దిగివచ్చేవారని నానుడి. ఒకనాడు దేవేంద్రుడు ఉమారుద్రకోటేశ్వరాలయానికి దర్శనార్ధం విచ్చేయగా, స్వామి  వారు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు వారించాడట. కోపగించుకున్న దేవేంద్రుడు నందితో ఘర్షణకు దిగగా నంది దేవేంద్రునికి శిరస్సుపై తన్నడంతో ఆలయానికి దూరంగా పడి స్పృహ కోల్పోయాడట. ఇంతలో సూర్యనారాయణ స్వామి ఇంద్రునికి స్వప్నంలో కనిపించి ఇక్కడే భూమిలో తానూ స్వయంభూగా ఉన్నానని వజ్రయుధంతో తీసి ప్రతిష్టించమని చెప్పి అంతర్ధానం అయ్యారట.

మేల్కొన్న వెంటనే తన వజ్రాయుధంతో త్రవ్వగా ఏకశిలా రూపంలో శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహం లభించటం, ఇంద్రుడు దేవాదిదేవతల సమక్షంలో విగ్రహ ప్రతిష్ట చేసి దేవాలయ నిర్మాణం చేసాడట.

ప్రతి సంవత్సరం ఉత్తరాయణంలో మార్చి 9, 10 తారీఖులలో మరియు దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2 తారీఖులలో సూర్యోదయ సమయాలలో సూర్య కిరణాలు నేరుగా స్వామి వారి పాదాలను తాకేట్టు నిర్మించటం సంబ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. ఈ దృశ్యాన్ని చూసి తరించేందుకు భక్తులు పోటీ పడుతుండటం విశేషం.

అరసవల్లిలో రధసప్తమి :

ముఖ్యంగా రథసప్తమి నాడు, దేశంలోని పలుప్రాంతల్లోంచి భక్తులు తరలివచ్చి  అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొనేందుకు పరితపిస్తుంటారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలైతే సరేసరి. మొత్తంగా లక్షల్లో భక్త జనసందోహం అరసవల్లికి పోటెత్తుతుంది.  వాహనాలు నిలుపు స్థలాలు చాలక ఇక్కట్లు పడటం జనం వంతు. పోలీస్ వారు నిరంతర శ్రమపడుతూ వచ్చే భక్తులకు సూర్యనారయణుని దర్శన భాగ్యం కలిగేందుకు నిరంతరం పడే శ్రమ అభినందనీయం.

అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వివరాలకు ఇచట క్లిక్ చేయండి.

రధసప్తమి తేదీ :

ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్లపక్షం వచ్చే సప్తమి తిధి నాడు రథసప్తమి జరుపుకుంటాము. ఈ సంవత్సరం అనగా 2023 రధసప్తమి జనవరి 28వ తారీఖున జరుపుకోవాలని పండితుల మాట.


బస్సు సౌకర్యం :

శ్రీకాకుళం బస్సు కాంప్లెక్ష్ నుండి శ్రీకూర్మం లేదా శ్రీకాకుళం పాత బస్సు స్టాండ్ నుండి వెళ్ళే బస్సుల్లో వెళ్ళవచ్చును. ఆటోల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఆటో ఛార్జ్ రూ.30/- నుండి రూ.40/- వరకు ఉండవచ్చు.

రైలు సౌకర్యం:

దేశంలో ఏమూల నుండైనా శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ వరకు రైళ్ళు కలవు. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి శ్రీకాకుళం బస్సు కాంప్లెక్ష్ వరకు 30 నిమిషాల ప్రయాణం. శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ ఆటోలు, కాబ్ సౌకర్యం ఉంది. నేరుగా అరసవల్లికి అద్దె మాటలాడుకోవచ్చు. ఆటో రూ.200/- క్యాబ్ రూ.600/-(సుమారుగా) మించక పోవచ్చు.

వసతి సౌకర్యం:

శ్రీకాకుళం పట్టణంలో పలు స్టార్ రేటెడ్ హోటల్స్ మరియు పలు ఇతర లాడ్జి  వసతి సౌకర్యం అందుబాటు ధరలలో లభ్యమౌతున్నాయి. అలాగే దూరప్రాంతాల నుండి వచ్చిన వారు శ్రీకాకుళం జిల్లాలో గల ఇతర ప్రముఖ దేవాలయాలను,  చారిత్రక ప్రదేశాలను చూసేందుకు శ్రీకాకుళం పట్టణంలో ఉండి(stay) అరసవల్లి దేవాలయ సందర్శన చేసుకోవటం సులభంగా ఉంటుంది. అలాగే దేవాలయం వారి డార్మిటరీ (పరిమిత గదులతో) ఉన్నది.  

No comments:

Post a Comment